టార్గెట్ ఈటల..నోటికి పనిచెప్పారుగా!

-

గత కొన్ని రోజులుగా ఈటల రాజేందర్..టీఆర్ఎస్ లక్ష్యంగా దూకుడుగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ఈటల…టీఆర్ఎస్ కు టెన్షన్ పుట్టిస్తున్నారు. ఇప్పటికే గజ్వేల్ లో పోటీ చేసి కేసీఆర్ ని ఓడిస్తానని ఈటల ఛాలెంజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే చేరికల కమిటీ కన్వీనర్ గా ఉన్న ఈటల…టీఆర్ఎస్ లోని ఎమ్మెల్యేలని, బడా నేతలని బీజేపీలోకి తీసుకోచ్చేందుకు ఈటల ట్రై చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు…తమతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, త్వరలోనే వారు బీజేపీలోకి వస్తారని అన్నారు. ఇంకా పలువురు నేతలు ఈ నెల 27 తర్వాత బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారని మాట్లాడారు. అయితే ఈటల ఎక్కడా కూడా తీవ్రమైన పదజాలం వాడుతూ…విమర్శలు చేయలేదు. రాజకీయ పరమైన విమర్శలే చేస్తూ వస్తున్నారు.

అయితే ఈటల వ్యాఖ్యలకు టీఆర్ఎస్ నేతలు వరుసపెట్టి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. కాకపోతే ఎప్పటిలాగానే నోటికి పనిచెబుతూ..ఈటలపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలు బాల్క సుమన్, వివేకానంద…ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, వరుసపెట్టి ప్రెస్ మీట్లు పెట్టి  ఈటలని తిట్టే కార్యక్రమం పెట్టుకున్నారు. ఈటల చేరికల కమిటీ అధ్యక్షుడు..అంటే బ్రోకర్ లా మారాడని విమర్శించారు. ఈటల ఎక్కువ మాట్లాడితే నాలుక చీరేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. 20 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఈటల అంటున్నారని, కనీసం వార్డు మెంబర్ కూడా టచ్ లో లేరని టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో బీజేపీ నుంచి టీఆర్ఎస్ లో చేరికలు ఉంటాయని, హుజూరాబాద్ లో ఈటల ఓటమి ఖాయమని, అందుకే గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని టీఆర్ఎస్ నేతలు ఈటలకు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే టోటల్ గా ఈటల వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నంలో టీఆర్ఎస్ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది…బీజేపీలోకి చేరికలు పెరుగుతాయనే సమయంలో రివర్స్లో టీఆర్ఎస్ లోకి చేరికలు ఉంటాయని మాట్లాడుతున్నారు. ఆల్రెడీ హుజూరాబాద్ లో గెలిచి..ఈటల తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు రాజీనామా చేసి గెలవాలని టీఆర్ఎస్ నేతలు పస లేని సవాల్ విసురుతున్నారు. మొత్తానికి ఈటల రాజకీయానికి చెక్ పెట్టడానికి గులాబీ నేతలు నోటికి పనిచెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version