యోగ అనేది శరీరం, మనస్సు మరియు ఆత్మను కలిపే ఒక అద్భుతమైన మార్గం. అయితే ఈ పవిత్రమైన సాధనను ఏ సమయంలో చేస్తే పూర్తి ప్రయోజనం పొందవచ్చనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఉదయం, సాయంత్రం లేక మధ్యాహ్నం? మీ బిజీ షెడ్యూల్‌లో యోగాకు సరైన సమయాన్ని కేటాయించడం అనేది మీ ఆరోగ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. మరి యోగా శాస్త్రం మరియు నిపుణులు దీని గురించి ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం!
బ్రహ్మ ముహూర్తం: ఆదర్శ సమయం, సాంప్రదాయ యోగా శాస్త్రం మరియు ఆయుర్వేదం ప్రకారం, యోగా చేయడానికి అత్యంత ఆదర్శవంతమైన సమయం ‘బ్రహ్మ ముహూర్తం’ . ఇది సూర్యోదయానికి దాదాపు 90 నిమిషాల ముందు మొదలై, సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో ప్రకృతి ప్రశాంతంగా, వాతావరణం స్వచ్ఛంగా ఉంటుంది. ఈ వేళలో యోగా సాధన చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అపారం మరి వాటిలో ముఖ్యమైనవి.
మెరుగైన ఏకాగ్రత: ఉదయం పూట మనసు ప్రశాంతంగా ఉంటుంది, కాబట్టి ధ్యానం మరియు ప్రాణాయామం పై సులభంగా దృష్టి పెట్టవచ్చు.
ఖాళీ కడుపు: ఉదయాన్నే కడుపు ఖాళీగా ఉంటుంది. ఆసనాలు వేసేటప్పుడు కడుపుపై ఒత్తిడి పడదు, దీనివల్ల ఆసనాలను సౌకర్యవంతంగా చేయవచ్చు.

పెరిగిన శక్తి స్థాయిలు: ఉదయాన్నే సాధన చేయడం వలన రోజు మొత్తానికి సరిపడా శక్తి మరియు ఉత్సాహం లభిస్తాయి. అయితే అందరూ ఉదయాన్నే చేయలేకపోతే, సూర్యాస్తమయానికి ముందు సాయంత్రం పూట యోగా చేయడం రెండవ ఉత్తమ సమయంగా పరిగణించవచ్చు. ఈ సమయంలో శరీరం కొంత ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది, దీనివల్ల కండరాల సాగిన ఆసనాలు వేయడానికి అనుకూలంగా ఉంటుంది.
రోజులో సమయాన్ని ఎంచుకోవడంలో నియమాలు: యోగ సాధనకు సరైన సమయాన్ని ఎంచుకోవడంలో కొన్ని ప్రాథమిక నియమాలు ఉన్నాయి, వాటిని గుర్తుంచుకోవడం ముఖ్యం. మొదటగా భోజనం చేసిన వెంటనే యోగా చేయకూడదు. కడుపు నిండుగా ఉంటే ఆసనాలు వేయడం కష్టం. చివరి భోజనానికి మరియు యోగా సాధనకు మధ్య కనీసం 3-4 గంటల విరామం లేదా తేలికపాటి స్నాక్స్ తీసుకుంటే కనీసం 1-2 గంటల విరామం తప్పనిసరి.
రెండవది, మీ శరీరానికి మరియు మీ దినచర్యకు ఏది అనుకూలంగా ఉందో దానిని ఎంచుకోవాలి. ఉదయం చేయలేకపోతే, సాయంత్రం లేదా మధ్యాహ్నం అయినా ఫర్వాలేదు, కానీ రోజూ ఒకే సమయానికి యోగా చేయడం అనేది చాలా ముఖ్యం. క్రమశిక్షణ అనేది యోగా నుండి పూర్తి ప్రయోజనం పొందడానికి కీలకం. కేవలం కొంత సమయం మాత్రమే దొరికితే ధ్యానం లేదా ప్రాణాయామానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.
గమనిక: మీ ఆరోగ్య పరిస్థితి లేదా శారీరక పరిమితులను బట్టి యోగా సాధన చేసే సమయాన్ని లేదా ఆసనాలను మార్చుకోవాల్సి వస్తే, యోగా గురువు లేదా వైద్య నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం.
