పిల్లలను వాగులోకి తోసి.. తను కూడా దూకేసింది ఓ తల్లి. తరువాత మనసు మార్చుకుని పిల్లలను రక్షించాలని ప్రయత్నించగా, అప్పటికే చిన్నారులు మృతి చెందారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దంతాన్ పల్లి గ్రామానికి చెందిన వడ్డేపల్లి మమతకు మాసాయిపేటకు చెందిన స్వామితో వివాహం జరిగింది, వారికి పూజ (7), తేజస్విని (5) ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండేళ్ల క్రితం స్వామి అనారోగ్యంతో మరణించగా, పిల్లల భారమంతా తల్లి మమతపైన పడడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కుంటుంది.
ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్న మమత, సోమవారం ఉదయం పిల్లలను తీసుకుని ఇస్లాంపూర్ శివారులోని హాల్దీవాగు వద్దకు వెళ్లి పిల్లలను తోసేసి తనూ దూకేసింది. వాగులోకి దూకిన తరువాత మనసు మార్చుకుని పిల్లలను రక్షించే ప్రయత్నం చేయగా, అప్పటికే పిల్లలు మరణించారు. సహాయం కోసం కేకలు వేయగా స్థానికులు తల్లిని రక్షించి పోలీసులకు సమాచారమివ్వగా, ఘటనా స్థలానికి చేరుకోని పిల్లల మృతదేహాలను వెలికితీసారూ పోలీసులు.