ఫోన్ పేలో ఆగిపోయిన అమ్మ ప్రాణం…!

-

నేను కాలేజీకి వెళ్ళగానే కాలేజి కింద నా ఫ్రెండ్స్ అందరూ జ్యూస్ తాగుతున్నారు. నేను కూడా వెళ్లాను అక్కడికి. ఇంతలో నా ఫ్రెండ్ ప్రదీప్ గాడు అడిగారు. మావా తాగుతావా అన్నాడు. తాగాను… అయితే మా దగ్గర ఉన్న డబ్బులకు 18 రూపాయలు తగ్గాయి. ప్రదీప్ గాడు అన్నాడు సురేష్ ని అరేయ్ ఫోన్ పే చెయ్ మావా అని. వాడు వెంటనే అక్కడ ఒక పేపర్ మీద ఏదో కోడ్ ఉంటే చేసాడు.

వెంటనే పని అయిపోయింది… నేను షాక్ అయ్యా. వాస్తవానికి నాది పల్లెటూరు. నాకు ఎప్పుడూ ఆ అవసరమూ రాలేదు. నేను పెద్దగా దాని గురించి తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. సరే కదా అని పైకి వెళ్ళగానే సురేష్ ని అడిగా. అరేయ్ మావా ఏంటీ ఫోన్ పే అనగానే… బ్యాంకు ఎకౌంటు ఉంటే చెప్పరా నేను నీకు కూడా చేస్తాను అనగానే నేను సమ్మర్ లో పనికి వెళ్లి కొనుక్కున్న స్మార్ట్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసాను.

ఆ తర్వాత నేను మూడు నాలుగు సార్లు వాడాను. రెండు సార్లు బట్టలు కొన్నా దగ్గరా వాడుకున్నాను, పెట్రోల్ కొట్టించాను. వాడటానికి మాత్రం అది చాలా సులువుగా ఉంది. నాకు దాంతో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. చాలా సార్లు రీచార్జ్ చేసుకున్నాను. ఇలా అనేక సార్లు డబ్బులు కూడా పంపించాను. అది నా జీవితంలో చాలా అవసరమైన యాప్ గా క్రమంగా మారిపోయింది.

గురువారం సాయంత్రం అమ్మకు ఆరోగ్యం బాగా లేదని ఆస్పత్రికి తీసుకువెళ్ళా. శుక్రవారం రిపోర్ట్స్ వచ్చాయి. అమ్మను హైదరాబాద్ తీసుకువెళ్లమన్నారు. అక్కడికి తీసుకువెళ్లగానే ఇంకో రెండు టెస్టులు చేసి, అమ్మకు అర్జెంట్ గా ఆపరేషన్ చెయ్యాలి అన్నారు. నేను వెంటనే నాన్నకు ఫోన్ చేసి నాన్నా అమ్మకు ఆపరేషన్ అంట… 1,80,000 అవుతుంది అన్నారు అని నాన్నకు ఫోన్ చేసి చెప్పా.

అమ్మ అంటే నాన్నకు ప్రాణం… అందుకే వెంటనే తెలిసిన పెద్దాయన దగ్గర 2 రూపాయల వడ్డీకి ఇల్లు తాకట్టు పెడితే లక్ష వచ్చాయి. మాది చిన్న ఇల్లే… వెంటనే నాన్న గేదె ఉంటే దాన్ని అమ్మితే ఒక 42 వేలు వచ్చాయి. వెంటనే ఆ డబ్బులు తీసుకుని నాన్న వచ్చేసాడు. ఉదయాన్ని బస్ దగ్గరకు వెళ్లి తీసుకొచ్చాను. అమీర్ పేట మైత్రీ వనం దగ్గర నాన్న బస్ దిగగానే నేను వెళ్లాను తీసుకురావడానికి.

ఇంకా 38 వేలు కావాలి. పైన ఖర్చులకు ఒక 5 వేల వరకూ కావాలి. వెంటనే బావ (పెద్ద అక్క వాళ్ళ ఆయన)కు చేస్తే 22 వేలు వేసాడు ఎకౌంటు లో. ఇంకా 16 వేలు చిన్నక్కను అడిగాను. చిన్నక్క వెంటనే డబ్బులు వేయించింది. శనివారం పొద్దున్నే 10 గంటలకు ఆపరేషన్ అన్నారు. నేను హడావుడిగా అక్కకు ఫోన్ చేస్తే చిన్నక్క వచ్చింది. దగ్గరే ఉంటారు సూర్యాపేటలో. బావది ఎలక్ట్రానిక్ షాపు.

9 గంటలకు డబ్బులు కట్టమంది డాక్టర్. సరే అని వెళ్లి నాన్న తెచ్చిన 1,42,000 కట్టేసాను. 38 వేలు ఎకౌంటు లో ఉన్నాయి గా స్వైప్ చేయమన్నారు. చేస్తే సర్వర్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. సరే అని ఏటీఎంకి వెళ్లి తెద్దామనుకుని వెళ్లాను. కార్డు డిక్లైన్ అంటుంది గాని డబ్బులు రావడం లేదు. సరే అని ఫోన్ పే ఉంది కదా అని హాస్పటల్ కి వచ్చాను. అక్కడ ఉన్న నర్సుని అడిగితే ఫోన్ పే చేయొచ్చు అంది.

వెంటనే ఫోన్ తీసి చేయగా డబ్బులు కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది గాని వాళ్లకు వెళ్ళలేదు. సరిగా ఆపరేషన్ కి 40 నిమిషాలు టైం ఉంది. నాకు కాళ్ళు చేతులూ ఆడట్లేదు. దగ్గరలో ఫ్రెండ్ ఎవడూ లేరు. 38 వేలు అలా ఆగిపోయాయి. బావ దగ్గరా డబ్బులు లేవు, చిన్నక్క మేడలో గొలుసు పెట్టి వేసాడు ఎకౌంటు లో. నాన్న ఏడుస్తున్నాడు. కట్టుకున్న పెళ్ళాం కదా, ఏడుపు తన్నుకొస్తుంది.

డాక్టర్ ని కలిసి చెప్పాను… ఈ రోజు ఆపరేషన్ చేయకపోతే ఆ డాక్టర్ కి సాయంత్రం అమెరికా ఫ్లైట్ ఉంది. వెళ్ళిపోతాడు… ఇప్పుడు అమ్మను ఇంకో హాస్పిటల్ కి తీసుకువెళ్ళే పరిస్థితి లేదు. కాళ్ళు చేతులు ఆడట్లేదు. 11 అయింది… 12 అయింది. అమ్మ చెవుల్లో నుంచి రక్తం వచ్చింది. డాక్టర్ ఏంటీ అని అడిగాడు గాని ఆపరేషన్ చేయడానికి ఇష్టపడలేదు. వెంటనే కస్టమర్ కేర్ కి కాల్ చేసాను.

ఈ రోజు సెకండ్ సాటర్ డే రేపు సండే అంది. 3 టూ 6 వర్కింగ్ డేస్ అని చెప్పింది. డాక్టర్ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాడు. నర్స్ వచ్చి బాడీని తీసుకువెళ్ళండి అంది. నాన్న కూలిపోయాడు అక్కడే. అక్క అమ్మా అని గట్టిగా ఏడుస్తుంది. నాకు మాట రావాడ౦ లేదు. నా అమ్మను నేనే చంపేసానా…? పెద్ద బావ అక్కకి ఇచ్చి పంపిస్తా అంటే వద్దు బావా చిన్నక్క వస్తుంది ఎకౌంటు లో వేయి అన్నాను.

చిన్న బావ లేట్ అవుతుందేమో అని ఎకౌంటు లో వేసేసాడు. అన్నీ సిద్దం చేసుకున్నాక నా అమ్మ ప్రాణం ఫోన్ పేలో ఆగిపోయింది. నాన్న నన్ను కొట్టాడు. నాన్నకు తెలీదు కదా… నాకు పే ఫోన్ మీద అంత నమ్మకం అని. అమ్మను తీసుకుని వెళ్లాం. అమ్మ దహన సంస్కారాలు అన్నీ పూర్తి చేసా౦. నాన్నకు మందులు తీసుకురావడానికి సెంటర్ కి వెళ్ళినప్పుడు 38000నా ఎకౌంటు కి క్రెడిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version