పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నాయకులు ఎలా అయినా ఏకాగ్రీవాలు చేయాలని చూస్తున్నారు. బెదిరించి ఎక్కువ ఏకగ్రీవాలు చేసుకుంటోందని టీడీపీ ముందు నుండీ ఆరోపిస్తోంది. అయితే రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో కర్నూలు మండలం రుద్రవరం గ్రామ పంచాయతీలో టీడీపీ మద్దతుతో బరిలోకి దిగిన మధు అనే వ్యక్తీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే అతను తమ వాడేనని వైసీపీ ప్రకటించుకుంది. ఈ పంచాయతీ సర్పంచ్‌కి వైసీపీ కండువా కప్పి ఏకగ్రీవాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఇది హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ స్వగ్రామం కావడంతో ఈ విషయం మీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
తాజాగా ఈ అంశం మీద ఆయన మాట్లాడుతూ చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు టీడీపీ ఏవో కొన్ని సర్పంచులు గెలిచారని అన్నారు. ఒకటి గెలిచినట్టు 10 గెలిచామని, 10 గెలిస్తే 100 గెలిచామని చంద్రబాబు చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు. టీడీపీ నుంచి తన గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు దుష్ప్రచారం చేశారని ఆయన ఆన్నారు. నా సొంత ఊరు రుద్రవరం లో వైసీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా సర్పంచ్ గా గెలిచారని, ఫ్యాక్షన్ లేకుండా ఏకగ్రీవంగా గెలిపించేందుకు నేను కూడా ఊరికి వెళ్లి ఒప్పించానని ఆయన అన్నారు. సర్పంచ్ గా ఎన్నికైన మధు భార్య గతంలో వైసీపీ జడ్పీటీసీ గా ఎన్నికయ్యారని, ఆయన చెప్పుకొచ్చారు.