కేకే కూతురికి మేయర్ పదవి ఇవ్వడంతో టీఆర్ఎస్ లో కొత్త చర్చ మొదలైందట. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. పీసీసీ చీఫ్‌గా పని చేసిన కే కేశవరావు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత పార్టీలో పెద్దపీటే వేశారు గులాబీ బాస్. టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్‌గానే కాకుండా..పంపారు. ఆ టర్మ్ అయిన తర్వాత రెండోసారి పెద్దల సభకు పంపించారు. ఇప్పుడు కేకే కుమార్తె గద్వాల్ విజయలక్ష్మిని హైదరాబాద్ మేయర్‌ను చేయడంతో టీఆర్‌ఎస్‌తోపాటు రాజకీయ వర్గాల్లో చర్చల్లో వ్యక్తి అయ్యారు కేశవరావు. ఆయన ఇంట్లో వీరిద్దరే కాదు.. కేకే కుమారుడు విప్లవ్ కుమార్ కూడా కీలక పదవిలో ఉండటంతో.. ఒకే కుటుంబానికి మూడు పదవులు అన్న చర్చ గులాబీ పార్టీ వర్గాల్లోను జోరందుకుంది.
టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడిగా పదవీ కాలం ముగిసిన తర్వాత కేశవరావుకు మళ్లీ ఛాన్స్ కష్టమేనని ప్రచారం జరిగింది. ఆయన ప్లేస్‌లో వేరొకరికి ఛాన్స్ ఇస్తారని రకరకాల పేర్లు చర్చల్లోకి వచ్చాయి. కానీ.. రాజకీయ, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్న గులాబీ దళపతి అందరినీ ఆశ్చర్య పరిచారు. కేశవరావును టీఆర్‌ఎస్ నుంచి రెండోసారి రాజ్యసభకు పంపించారు. ఆయన కుమారుడు విప్లవ్.. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా ఉన్నారు. ఇది రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి. అటు తండ్రీ కొడుకులు పార్టీలో.. ప్రభుత్వ పదవుల్లో మంచి పొజిషన్‌లో ఉండగా.. కిందటి గ్రేటర్ పాలకమండలిలో కేకే కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి కార్పొరేటర్‌గా కొనసాగారు. ఆ విధంగా అప్పట్లోనే కేశవరావు ఇంట్లో మూడు పదవులు వచ్చాయి. మరోసారి కార్పొరేటర్‌గా గెలిచిన కుమార్తెకు ఇప్పుడు ప్రమోషన్ రావడంతో .. టీఆర్‌ఎస్‌లో పదవులు ఎలా దక్కుతున్నాయి అన్న అంశాన్ని హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నారు పార్టీ నాయకులు.
గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠం కోసం చాలా మంది ప్రయత్నాలు చేసినా.. కేకే కుమార్తె గద్వాల్ విజయలక్ష్మికి ఛాన్స్ దక్కడం అందరినీ ఆశ్చర్య పరిచింది. గ్రేటర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో చాలా మంది ఆ సీటును ఆశించారు. అయితే విధేయతను పరిగణనలోకి తీసుకున్నారా? లేక సామాజిక సమీకరణాలతో కుస్తీ పట్టి పదవులు ఇస్తున్నారా అని కొందరు చర్చించుకుంటున్నారు. కేకే కుటుంబానికి ఈ రెండు అంశాలు కలిసి వచ్చాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే కుమార్తెకు పదవి వచ్చేలా ఎంపీ కేశవరావు పావులు కదిపారనే గుసగుసలూ టీఆర్‌ఎస్‌లో వినిపిస్తున్నాయి. మొత్తంగా టీఆర్‌ఎస్‌లో సీఎం కేసీఆర్ కుటుంబం తర్వాత కేకే ఫ్యామిలీలోనే మూడు పదవులు ఉన్నాయని చెవులుకొరుక్కుంటున్నాయి గులాబీ శ్రేణులు.