ఏపీ ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. పాత నోటిఫికేషన్ నే ఎస్ఈసీ కొనసాగించనున్నట్టు దీనిలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే కొనసాగించనున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 కార్పోరేషన్లు, 75 మున్సిపాల్టీలు, నగర పంచాయతీల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. గతంలో స్క్రూటనీ వరకు వచ్చిన ప్రక్రియ కరోనా కారణంగా ఆగింది. ఆ లెక్క ప్రకారం మార్చి 2,3 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ ఉండనుంది. మార్చి 10 పోలింగ్ ఉండనుంది.
అలానే మార్చి 14న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక రాజమండ్రి, నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్లకు ఎన్నికలు జరిగడం లేదు. ఈ రెండు చోట్ల కోర్టు కేసులు పెండింగులో ఉండడం వల్ల ఎన్నికలు జరగడం లేదు. అయితే తాడేపల్లి, తాడిగడప వంటివి ఇంకొన్ని పంచాయతీలు.. మున్సిపాల్టీలుగా మారాయి. అయితే పాత నోటిఫికేషన్ ప్రకారం జరుగుతూ ఉండడంతో వీటికి కూడా ఎన్నికలు జరగడం లేదు. ఇక ఎన్నికలు జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ లు ఈ మేరకు ఉన్నాయి. విజయనగరం, గ్రేటర్ విశాఖపట్నం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురంలలో ఎన్నికలు జరగనున్నాయి.