దళితుడు మీ కుటుంబ సభ్యుడు కాదా?.. కేటీఆర్‌కు ఎంపీ లక్ష్మణ్‌ కౌంటర్‌

-

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చినప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ కు జ్వరం, జలుబు, దగ్గు వస్తాయని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. మోదీ సభ విజయవంతమయిందని… బీరు, బిర్యానీ కోసం కాకుండా మోదీ ప్రసంగాన్ని వినడం కోసమే ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారని చెప్పారు. సభ విజయవంతం కావడంతో కేటీఆర్ కు పాలుపోవడం లేదని… బిత్తరపోయి గత్తర చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని అనే గౌరవం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని అన్నారు. తెలంగాణ మొత్తం తమ కుటుంబమే అన్న కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ… దళితుడిని ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదని, దళితుడు మీ కుటుంబ సభ్యుడు కాదా? అని ప్రశ్నించారు.

మద్ధతు ధర అడిగిన రైతుల చేతులకు బేడీలు వేశారని.. గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇస్తామని అధికారులను వారిపై ఉసిగొల్పి దాడులు జరిపించారని ఫైర్‌ అయ్యారు. నిరుద్యోగులు, బీసీలు, ఎస్టీలు మీ కుటుంబ సభ్యులు కాదా అని ధ్వజమెత్తారు. వాళ్లు మీ కుటుంబ సభ్యులే అయితే ఎందుకు పరీక్షలు సరిగ్గా నిర్వహించడం లేదని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించకుండా.. అవినీతి అక్రమాలకు పాల్పడినవారిని కాపాడుతున్నారని ఆరోపించారు. 30 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని… కేవలం మద్యం వల్లనే రూ.6వేల కోట్ల నుంచి రూ.40వేల కోట్ల వరకు ఆదాయం పెంచుతున్నారని.. దానివల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని మండిపడ్డారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version