మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ సమరభేరి పేరిట నేడు భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సభలో ఇటీవల ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. మునుగోడులో జరుగుతున్న బీజేపీ భారీ బహిరంగసభలో రాజగోపాల్ రెడ్డికి అమిత్ షా బీజేపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ ను బండకేసి కొట్టాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ మునుగోడు సభ జనం లేక వెలవెల బోయిందన్నారు కె.లక్ష్మణ్. రైతులను, యువతను మభ్యపెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, రూ.2 లక్షల కోట్ల సబ్సిడీ, ఫసల్ బీమా పథకంతో ఓ వైపు మోడీ రైతులను ఆదుకుంటుంటే… ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా పై కేసీఆర్ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని కె.లక్ష్మణ్ మండిపడ్డారు.
8 ఏళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను కేసీఆర్ మోసం చేశారని చెప్పారు. కేసీఆర్ కుటుంబం అవినీతి కోరల్లో కూరుకుపోయిందన్న లక్ష్మణ్… కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటి వేర్లతో సహా పెకిలించివేస్తామని ధీమా వ్యక్తం చేశారు కె.లక్ష్మణ్. ఎన్నికలొచ్చినప్పుడే కేసీఆర్ కు ప్రజలు గుర్తుకొస్తారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే దళిత బంధు ఇచ్చినట్లుగానే… చేనేత, గౌడ, ముదిరాజ్ తదితర కులాల ప్రజలకు రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కె.లక్ష్మణ్. కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరిస్తున్నారన్న ఆయన… కేసీఆర్ మెడలు వంచడానికే అమిత్ షా వచ్చారని స్పష్టం చేశారు కె.లక్ష్మణ్. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కంటే మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు కె.లక్ష్మణ్.