మునుగోడు ఉపఎన్నిక పోరు చివరిదశకు చేరుకుంది. ఇవాళ్టితో ప్రచారఘట్టానికి తెరపడనుండటంతో ప్రధాన పార్టీలు ఆఖరి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఓటర్లను తమవైపు తిప్పుకోవటమే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఉప పోరును టీఆర్ఎస్, బీజేపీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోగా కాంగ్రెస్ పార్టీ కూడా హోరాహోరీగా తలపడుతోంది.
టీఆర్ఎస్ తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు మునుగోడులో, ఆదివారం రోజు చండూరులో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మంత్రులు మండలాలవారీగా, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు గ్రామలవారీగా బాధ్యతలు తీసుకొని ప్రతిఓటరును కలిశారు. వామపక్షాల బలాన్ని ఒడిసిపట్టేందుకు కూడా గులాబీపార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది.
40 మంది స్టార్ క్యాంపెయినర్లతో బీజేపీ.. టీఆర్ఎస్ కు దీటుగా ప్రచారం నిర్వహించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్ సహా ఇతర నేతలు ఇంటింటికి తిరిగారు. పార్టీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గంలోనే మకాం వేసి విస్తృత ప్రచారం చేశారు. కొన్నిరోజులుగా ప్రచారంలో వేగం పెంచిన కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకును నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఒక్కసారి ఛాన్స్ అంటూ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇంటింటికి తిరుగుతున్నారు. ఆమె తరఫున పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా ఇతర నేతలు ప్రచారం చేశారు.