బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ప్రచారంలో పలు చోట్ల ఉద్రిక్తతలు తలెత్తాయి. ప్రచారంలో భాగంగా సైదాబాద్ వెళ్లిన రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తి బీజేపీ జెండా కర్రను విసరడంతో టీఆర్ఎస్ కార్యకర్తకు గాయమైంది. అనంతరం ఆరెగూడెం వెళ్లిన రాజగోపాల్ రెడ్డి అక్కడ ప్రసంగం ముగించే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. దీంతో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రాజగోపాల్‌రెడ్డిని అక్కడి నుంచి పంపించేశారు.
ఆరెగూడెంలో జరిగిన ఘటనను మంత్రి హరీశ్ రావు హేయమైన చర్యగా అభివర్ణించారు. ఎన్నికల కమిషన్ నిర్ణయించిన ఎన్నికల ప్రచారం సమయం ముగిసిన తర్వాత ఆరెగూడెంలో ప్రచారం చేసిన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై అక్కడి ప్రజలు తిరగబడ్డారన్న మంత్రి.. ఆగ్రహానికి లోనైన రాజగోపాల్ రెడ్డి వర్గీయులు ప్రజలపై దాడి చేయడం మొదలుపెట్టారన్నారు. బీజేపీ నాయకులు చేసిన ఈ దాడిలో టీఆర్ఎస్ నాయకులు గాయపడటంతో పాటు, పలువురు విలేకరులు గాయపడ్డారని తెలిపారు. ప్రజలపై గూండాగిరి చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని ఓటర్లను కోరారు.