రాష్ట్ర ప్రభుత్వంలో తన స్థానం 11 అని రెవెన్యూ, గృహ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం సెక్రటేరియట్‌లో నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో ఆయన అనేక ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ తర్వాత స్థానంలో ఎవరు ఉన్నారని ఎదురైన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. నా స్థానం 11 అని వివరించారు. రెండో స్థానంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావొస్తున్న సందర్భంగా డిసెంబర్ 7లోపు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని పొంగులేటి వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే పలు కీలక బిల్లులను ఆమోదించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. కొత్త ఆర్వోఆర్ బిల్లుకు ఆమోదం తెలిపి చట్టం చేస్తామన్నారు. డిసెంబరు నుంచే కొత్త ఆర్వోఆర్ చట్టం అమల్లోకి వస్తుందని స్పష్టంచేశారు.ఇటీవల సీఎంతో జరిగిన సమావేశంలో ఆర్వోఆర్ ముసాయిదాపై స్వల్ప చర్చ జరిగిందని మంత్రి క్లారిటీ ఇచ్చారు.