విజయ పరంపరను కొనసాగిస్తున్న మైత్రి మూవీ మేకర్స్

-

తెలుగు చిత్ర పరిశ్రమలో ఆ నిర్మాణ సంస్థలో ఒక సినిమా అయినా చేయాలని ప్రతి దర్శకుడు, హీరో కోరుకుంటారు. కొద్ది సంవత్సరాల్లోనే భారీ విజయాలను సాధించిన ఆ నిర్మాణ సంస్థ ప్రస్తుతం వరుస సినిమాలను తన బ్యానర్ లో నిర్మిస్తుంది. 6 ఏళ్లలో 11 సినిమాలు నిర్మించి 9 హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇంతకీ అది ఏ నిర్మాణ సంస్థ అంటే 2015లో నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, చెరుకూరి మోహన్ ల త్రయం కలిసి స్థాపించిన మైత్రి మూవీ మేకర్స్.

ఆగడు ప్లాప్ తో ఢీలాపడిన మహేష్ కు బూస్టింగ్ ఇచ్చిన నిర్మాణ సంస్థ మన మైత్రి మూవీ మేకర్స్ అనే చెప్పాలి. కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ ల వర్షం కురింపించింది. రూ. 70 కోట్ల బడ్జెట్ తో నిర్మింతమైన శ్రీమంతుడు ఓవరాల్ రూ. 200 కోట్లు వసూళ్లు రాబట్టింది. దీంతో మైత్రి మూవీ మేకర్స్ ఒక్కసారిగా టాలీవుడ్ తిరుగులేని స్థాయికి చేరుకుంది. తన రెండో సినిమాను మైత్రి కొరటాల శివకే ఇచ్చింది. జూ. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ మైత్రికి తిరుగులేని విజయాన్నిచ్చింది. ఎన్టీఆర్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది జనతా గ్యారేజ్. 2018లో వచ్చిన రంగస్థలం మైత్రిని మరో మెట్టు ఎక్కించింది. వరుసగా మూడు భారీ విజయాలు రావడంతో మైత్రి తెలుగు సినీ నిర్మాణ రంగంలోనే అగ్రస్థానంలో నిలిచింది.

తరువాత వచ్చిన సవ్యసాచి, అమర్ అక్బర్ అంటోని మైత్రికి కొంచెం ఛేదు అనుభవాన్నే కలిగించాయి. వరుస విజయాలు తరువాత రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో చిన్న సినిమాలపై మొగ్గు చూపించింది. మైత్రికి ఉన్న ప్రధాన బలం ఏంటంటే కథను నమ్మి సినిమాను నిర్మిస్తారు. అదే మరలా వారికి చిత్రలహరి రూపంలో విజయాన్ని అందించింది. చిత్రలహరి విజయంతో 2019లోనే మైత్రి ఏకంగా నాలుగు సినిమాలు నిర్మించింది. దానిలో నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్, సంగీత దర్శకుడు కీరవాణి రెండో కొడుకు హీరోగా పరిచయం అయిన మత్తు వదలరా, విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ లు ఉన్నాయి. 2019 సంవత్సరాన్ని మైత్రికి స్వర్ణయుగమనే చెప్పాలి. దీంతో మైత్రి సక్సెస్ రేట్ మళ్లీ తారస్థాయికి చేరింది.

కరోనా మహమ్మారితో ప్రపంచమే ఆగిపోయిన వేళ.. అన్ని ఇండస్ట్రీలు సినిమాలు ఆడతాయా.. మనం పెట్టిన డబ్బులు మనకి వస్తాయా అని ఆందోళన చెందుతుంటే మైత్రి కొత్త దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెనతో.. కెరటంలాగ ఉప్పొంగి విజయాన్ని సాధించింది. చిత్ర పరిశ్రమకు ఒక దిక్సూచిగా మారింది. తరువాత దర్శకుడు సుకుమార్ తో భారీ ప్రాజెక్ట్ కు సిద్ధమైంది మైత్రి. అల్లుఅర్జున్ హీరోగా రెండు పార్ట్ లుగా సిద్ధమవుతున్న “పుష్ప”పై మైత్రి భారీ అంచనాలనే పెట్టుకుంది.

అనుకున్నట్టుగానే 2021 డిసెంబర్ 17న రిలీజ్ అయిన పుష్ప ది రైజ్ ఘన విజయాన్ని సాధించి మైత్రికి తిరుగులేదని నిరూపించింది. అలాగే 2022లో మైత్రి భారీ సినిమాలనే ప్లాన్ చేసింది. మహేష్ బాబుతో సర్కార్ వారి పాట, నానితో అంటే సుందరానికీ, సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, అల్లుఅర్జున్ తో పుష్ప పార్ట్ 2 నిర్మించనుంది. 2022లో మైత్రి కాంపౌడ్ నుంచి నాలుగు సినిమాలు రానున్నాయి. వరుస విజయాలతో దుసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ తన విజయ పరంపరను ఈ సంవత్సరంలోనూ కొనసాగించనుందా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version