కరోనా నేపథ్యంలో ప్రస్తుతం చాలా మంది ఎన్ 95 మాస్కులను వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణ మాస్కుల కన్నా ఇవి కరోనా నుంచి ఇంకా ఎక్కువ రక్షణను అందిస్తాయని తెలుస్తుండడంతో.. అనేక మంది ప్రస్తుతం ఎన్ 95 మాస్కులను వాడుతున్నారు. అయితే ఈ మాస్కులను శానిటైజ్ చేయాలంటే ఇప్పటి వరకు యూవీ (అల్ట్రావయొలెట్) లైట్ ఒక్కటే ఉత్తమమైన మార్గం అని అనుకున్నారు. కానీ వీటిని ఇండ్లలో ఉండే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌తోనూ శానిటైజ్ చేయవచ్చని పరిశోధకులు గుర్తించారు.
ఇండ్లలో ఉండే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో పలువురు పరిశోధకులు కొన్ని ఎన్ 95 మాస్కులను ఉంచి కుక్కర్‌లో నీటిని పోయకుండా వాటిని డ్రై హీట్ చేసి శానిటైజ్ చేశారు. 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద కుక్కర్‌లో 50 నిమిషాల పాటు మాస్కులను శానిటైజ్ చేశారు. దీంతో ఆ మాస్కు ఎప్పటిలాగే పనిచేస్తుందని గుర్తించారు. అంతేకాదు.. అలా ఒక్కో మాస్కును కనీసం 20 సార్లు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో వేసి శానిటైజ్ చేయవచ్చని తెలిపారు. దీంతో మాస్కుల్లో ఉండే కరోనా వైరస్ దాదాపుగా పూర్తిగా నాశనమవుతుందని అంటున్నారు.
అయితే మాస్కులను శానిటైజ్ చేసేటప్పుడు నీటిని పోయరాదు. అలాగే అవి లోపల కుక్కర్‌కు తగలకుండా ఉండేందుకు గాను.. కింది భాగంలో, చుట్టూ టవల్స్ ను ఉంచాలి. అనంతరం అందులో మాస్కులను వేసి హీట్ చేయవచ్చు. ఇలా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ద్వారా కూడా ఎన్ 95 మాస్కులను శానిటైజ్ చేయవచ్చు. అయితే హాస్పిటల్స్‌లో ఇలా చేస్తే ఎంతో ఉపయోగం ఉంటుందని సైంటిస్టులు అంటున్నారు. మాస్కులను ఎప్పటికప్పుడు తెప్పిస్తూ డబ్బు వెచ్చించేకంటే.. ఇలా చేయడం వల్ల డబ్బు సమయం ఆదా అవుతాయని అంటున్నారు. కాగా సైంటిస్టులు చేపట్టిన ఈ పరిశోధనలకు చెందిన వివరాలను ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లెటర్స్ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ పరిశోధకులు ఈ ప్రయోగాలు చేశారు.