ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించడం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తో రాష్ట్ర ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. తమ సమస్యల పరిష్కారానికి గవర్నర్ కల్పించుకొని చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించేలా గవర్నర్ చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు విన్నవించారు.
దీనిపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు స్పందించారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం పై గవర్నర్ కు ఫిర్యాదు చేయడం చరిత్రలో ఇదే మొదటి సారి అని పేర్కొన్నారు. డిఎ, జిపిఎఫ్, ఏపీ జిఎల్ఐ, రిటైర్మెంట్ ప్రయోజనాలు అందక ఆందోళన చేయడానికి అనుమతి దొరకని పరిస్థితులలో ఉద్యోగులు గవర్నర్ ను కలిశారని వివరించారు. వైసిపి అసమర్థ పాలనకు ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేం కావాలని ప్రశ్నించారు నాగబాబు.