శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ యువశక్తి సభ ఏర్పాటు చేసింది. అయితే.. ఈ సభకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు కూడా హాజరయ్యారు. ఈ సభలో నాగబాబు ప్రసంగిస్తూ, జనసేన కుటుంబ పార్టీ కాదని, కుల పార్టీ అంతకన్నా కాదని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ కులాలకు సమ ప్రాధాన్యతనిచ్చే పార్టీ జనసేన అని ఉద్ఘాటించారు. పవన్ కల్యాణ్ లాగా నాయకత్వ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరిదీ జనసేన అని పేర్కొన్నారు నాగబాబు. “నేను పవన్ కల్యాణ్ సోదరుడ్ని. ఈ సందర్భంగా జనసేన కుటుంబ పార్టీ కాదని స్పష్టం చేయదలచుకున్నాను. ఎలాగంటే… నేను జనసేన పార్టీ అభివృద్ధికి, నిర్మాణానికి ఒక మెట్టులా పాటుపడతానే తప్ప భవిష్యత్తులో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అందులో నేను పాలుపంచుకోను.
కేవలం పార్టీ కోసమే పనిచేస్తాను. ఆ విధంగా జనసేన కుటుంబ పార్టీ కాదు, ఇది మీ అందరి పార్టీ. ఈ సందర్భంగా ఇంకొక విషయం చెప్పాలి. మన నాయకుడు పవన్ కల్యాణ్ రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు… ముఖ్యమంత్రి అవుతారు… ఇది తథ్యం. జనసేన పార్టీలో ప్రతి ఒక్కరికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం కల్పించే పార్టీ ఒక్క జనసేన మాత్రమే. కష్టపడితే సీఎం అయ్యేందుకు
కూడా జనసేనలో అవకాశం ఉంటుంది” అని వ్యాఖ్యానించారు నాగబాబు.