నాగాలాండ్ ఘటనపై ఈరోజు పార్లమెంట్ దద్దరిల్లే అవకాశం ఉంది. నిన్న నాగాలాండ్ లో జవాన్ల ఫైరింగ్లో 14 మంది అమాయకపు పౌరులు చనిపోయారు. ఉగ్రవాదులుగా భావించిన జవాన్లు ట్రక్కుపై కాల్పులు జరిపారు. బొగ్గు గనిలో విధులు ముగించుకుని కార్మికులు వెళ్తుండగా మోన్ జిల్లాలోని ఓటింగ్ వద్ద ఈ కాల్పులు జరిగాయి. కార్మికులు తిరు గ్రామం నుంచి ట్రక్కులో ఇంటికి వెళ్తున్నారు. అయితే, మిలిటెంట్ల కదలికలున్నట్లు సైన్యానికి సమాచారం అందింది. ఈ మేరకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన బలగాలు.. కాల్పులు జరిపాయి. అయితే, కాల్పుల్లో పౌరులే ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. దీంతో కోపోద్రిక్తులపైన ప్రజలు ఆర్మీపై దాడులు చేశారు. పలు షాపులకు నిప్పు పెట్టారు. ఈ ఘటనపై ఇప్పటికే సిట్ ఏర్పాటు చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై హత్యానేరం కేసులు కూడా పెట్టారు.
ఈ ఘటనపై కాంగ్రెస్, త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఫైరయ్యాయి. దీంతో ఈరోజు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఇదే ప్రధాన అంశంగా మారే అవకాశం ఉంది. దీంతో ఈ రోజు పార్లమెంట్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం పార్లమెంటులోని రెండు సభల్లో షా మాట్లాడనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మొదట లోక్సభలో తర్వాత రాజ్యసభలో ఈ ఘటనపై అమిత్ షా ఓ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.