కారణం లేదు.. కానీ, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన విందు ఇస్తున్నారు. అది కూడా పార్లమెంటులోని దాదాపు 300 మంది ఎంపీలకు ఢిల్లీలో ఈ రోజు అంటే బుధవారం విందు ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. విందుకు వచ్చిన ఎంపీలకు ఖరీదైన బహుమతులు కూడా ఇస్తున్నారు. మరి ఇంత చేస్తూ.. కారణం లేదనడే ఇక్కడ ప్రధాన ట్విస్ట్. మరి ఎవరు? ఎందుకు? అనే సందేహాలు సాధారణమే కదా? అక్కడికే వద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై విజయం సాధించిన రఘురామ కృష్ణం రాజు ఈ విందును ఏర్పాటు చేశారు.
ఎంపీ రఘు ఇచ్చే ఈ విందుకు కాంగ్రెస్ ఎంపీ, తనకు స్వయానా వియ్యంకుడు అయినా కేవీపీ రామచంద్రరావు నివాసమే వేదికగా మారింది. ఇప్పటికే ఘనంగా ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. ఉత్తరాది, దక్షిణాది వంటకాలు కూడా రెడీ అవుతున్నాయి. ఇక, సంగీత్‌లు, కవ్వాలీ నృత్యాలు, భరత నాట్యం వంటివాటిని కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం.
మొత్తంగా దేశంలోని 300 మంది ఎంపీలను ఈ పార్టీకి ఎంపీ రఘు ఆహ్వానించారు. దీంతో ఇది జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించింది. అయితే, దీని వెనుక రాజకీయ వ్యూహం లేకుండా ఇంత ఖర్చు పెడతారా? అనేది ప్రశ్న. పైగా రెండు మాసాల కిందటే ఆయన చెప్పినట్టు అప్పుల్లో ఉన్న వ్యాపార వేత్త ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నట్టు? అనేది కీలక ప్రశ్న. ఇదే సమయంలో బీజేపీ సారథి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ విందుకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఇక, ఇతర పార్టీల నుంచి కూడా ఎంపీలను ఆహ్వానించారు.
మొత్తంగా చూస్తే.. ఈ విందు వెనుక రఘు రాజకీయంగా వేసే ఎత్తుగడ ఉందని చెబుతున్నారు. తనను ఆర్థికంగా నిరూపించుకోవడం, ప్రతి ఒక్కరికీ తనను తాను జాతీయ స్థాయిలో పరిచయం చేసుకోవడం అనే ప్రధాన లక్ష్యంగా రఘు ఈ విందును ఏర్పాటు చేసినట్టు ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అదేస మయంలో రాష్ట్రంలోనూ తనకు తిరుగులేదని అనిపించుకునే క్రమంలోనే ఆయన ఈ అడుగులు వేస్తున్నారని అంటున్నారు. మరి ఏమవుతుందో ? చూడాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.