భారతదేశానికి వడదెబ్బ తగిలింది. వేసవికాలంలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలతో అనేక రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదితోపాటు ఈశాన్య రాష్ట్రాలు నిప్పుల కుంపటిగా మారాయి. ముఖ్యంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో దిల్లీ అల్లాడిపోతోంది. జూన్ 11-19 మధ్యలో వడదెబ్బ కారణంగా 192 మంది నిరాశ్రయులు మృత్యువాత పడినట్లు సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్ (సీహెచ్‌డీ) అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. దీన్ని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.
మరోవైపు మార్చి 1 నుంచి జూన్ 18 మధ్యకాలంలో దాదాపు 40వేల వడదెబ్బ అనుమానిత కేసులు, 110 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. జూన్‌లో కేవలం ఒక్క వారంలోనే దిల్లీలో 192 మంది నిరాశ్రయులు ప్రాణాలు విడిచారని ఓ స్వచ్ఛంద సంస్ధ వెల్లడించింది. ఉత్తర్ ప్రదేశ్‌లో 36 వడదెబ్బ మరణాలు చోటుచేసుకోగా బిహార్, రాజస్థాన్, ఒడిశాలోనూ పదుల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. ఆయా రాష్ట్రాల నుంచి అందిన సమాచారం మాత్రమేనని.. వాస్తవ సంఖ్య ఇంతకంటే అధికంగానే జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (NCDC) ఆధ్వర్యంలోని జాతీయ ఉష్ణోగ్రత ప్రభావిత అనారోగ్యం, మరణాలపై పర్యవేక్షణ విభాగం వెల్లడించింది.