రెండు వేల రూపాయల నోట్లను కూడా కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నోట్లను రేపటి నుంచి బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవచ్చు. రూ.2,000 నోట్లను తడవకు రూ.20 వేల విలువ వరకు ఎలాంటి పత్రాలు నింపకుండా, గుర్తింపు కార్డులు చూపకుండా నేరుగా బ్యాంకు శాఖల్లో ప్రజలు మార్చుకోవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తెలిపింది. ఈ మేరకు వివరాలు తెలుపుతూ, అన్ని సర్కిళ్ల చీఫ్ జనరల్ మేనేజర్లకు సమాచారం ఇచ్చింది.
ప్రజలు ఎవరైనా రూ.2,000 నోట్లను 10 వరకు తెచ్చుకుని, ఇతర నోట్లకు మార్చుకోవచ్చని స్పష్టం చేసింది. నోట్లు మార్చుకునే సమయంలో ఎలాంటి గుర్తింపుకార్డు సమర్పించాల్సిన అవసరం లేదనీ తెలిపింది. రూ.2,000 నోట్ల మార్పిడికి ఈనెల 23 నుంచి సెప్టెంబరు 30 వరకు అనుమతి ఇస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో నిబంధనలకు లోబడి ప్రజలకు సహకరించాలని, ఎలాంటి అసౌకర్యం లేకుండా రూ.2,000 నోట్ల మార్పిడి కార్యక్రమం సజావుగా నిర్వహించాలని సిబ్బందికి సూచించింది.