26/11 ముంబయి ఉగ్రదాడి సూత్రధారి తహవూర్ రాణాను ఎట్టకేలకు అమెరికా నుంచి భారత్‌కు తీసుకొచ్చారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాణాను అధికారులు భారీ భద్రత నడుమ జాతీయ దర్యాప్తు సంస్థ కేంద్ర కార్యాలయానికి తరలించారు. అయితే రాణా భారత్ కు వచ్చాడని తెలుసుకున్న భారతీయులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమ దేశంలో అల్లకల్లోలం సృష్టించాలని ప్రయత్నించి.. ఎంతో మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్న రాణాను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
జైలులో రాణాకు రాచమర్యాదలు చేయొద్దని.. బిర్యానీ పెడుతూ మేపొద్దని 26/11 దాడుల బాధితులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వొద్దని.. వీలైనంత త్వరగా రాణాను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. రాణా లాంటి నీచులకు ఉరే సరి అని ఉగ్రదాడి జరిగిన సమయంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడిన ఛాయ్ వాలా మహ్మద్ తౌఫిక్ అన్నారు. ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి దేశంలో కఠినమైన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నిందితులను కాపాడేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేయకూడదని ప్రభుత్వాన్ని కోరారు.