తెలంగాణ అమర్ నాథ్ యాత్రగా భావించే సలేశ్వరం జాతర ఉత్సవాలు శుక్రవారం (ఏప్రిల్ 11వ తేదీ 2025) ప్రారంభం కానున్నాయి. చుట్టూ అడవి.. కొండాకోనల మధ్య.. జలపాతాల సవ్వడి నడుమ.. పక్షుల కిలకిలరావాలు పులకిస్తుండగా.. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో లింగమయ్య స్వామి వెలిశారు. ఆయణ్ను దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి ప్రజలు తరలివస్తారు. అయితే లింగమయ్య దర్శనం అంత ఈజీగా జరగదు. ఆయణ్ను దర్శించుకోవాలంటే కొండలు ఎక్కాలి.. వాగలు దాటాలి.. చెట్లుచేమల మధ్య కాలినడకన ప్రయాణించాలి.
అడవి తల్లి ఒడిలో కొలువైన లింగమయ్యను చూసేందుకు రెండు కళ్లు చాలవు. అందుకే ప్రతి ఏటా సలేశ్వరం జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలో ఈనెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు అడవిలోకి అనుమతి ఉంటుంది. లింగమయ్య స్వామిని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు తరలి రానున్న నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. గుహలో కొలువుదీరిన లింగమయ్యను దర్శించుకోవాలంటే భక్తులు సాహసం చేయాల్సిందే. అందుకే ఈ జాతరను సాహసోపేత తెలంగాణ అమరనాథ్ యాత్రగా పిలుస్తారు.