మేం అధికారంలోకి వస్తే అగ్నిపథ్ రద్దు : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే

-

సైనిక బలగాల నియామకం కోసం మోదీ సర్కార్ తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. ఈ పథకం వల్ల దేశ యువతకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. వారికి న్యాయం చేయాలని కోరారు. అగ్నిపథ్ పథకంతో అనేక సమస్యలు ఉన్నాయన్న ఖర్గే.. దీని వల్ల ఒకే కేడర్లోని సైనికుల మధ్య వివక్ష ఏర్పడుతుందని తెలిపారు. ఒకే పని చేసినప్పటికీ వేతన భత్యాలు మాత్రం వేరుగా ఉంటాయని వెల్లడించారు. నాలుగేళ్ల సర్వీసు తర్వాత మెజారిటీ అగ్నివీరులు అనిశ్చితితో కూడుకున్న జాబ్ మార్కెట్లోకి ప్రవేశిస్తారన్న ఖర్గే.. ఇది సామాజిక స్థిరత్వానికి కూడా ప్రమాదకరమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.

“2019-2022 మధ్య 2 లక్షల మంది యువత త్రివిధ దళాల్లో చేరారు. అన్ని కష్టాలు ఎదుర్కొని సైన్యంలో సేవలందించారు. అగ్నిపథ్ పథకం ప్రవేశపెడుతున్నట్లు 2022 మే 31న ప్రభుత్వం చేసిన ప్రకటనతో వారి ఆశలన్నీ నీరుగారాయి. ‘అగ్నిపథ్’ స్కీమ్ ప్రకటనతో సైన్యం ఆశ్చర్యానికి గురైందని నేవీ, ఎయిర్ఫోర్స్కు ఇది పిడుగుపాటు లాంటి వార్త అని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె అభిప్రాయపడ్డారు. మన యువత ఇలా బాధపడకూడదు. న్యాయం జరిగేలా మీరే చూడాలి.” అని ఖర్గే రాష్ట్రపతికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version