వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై లోక్‌సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగిన సమయంలో బీజేపీ అధ్యక్ష ఎన్నిక గురించి అకస్మాత్తుగా ప్రస్తావన వచ్చింది. ఎంపీ అఖిలేష్ యాదవ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్య ఈ విషయంలో జరిగిన సంభాషణ సభలో నవ్వులు పూయించింది. ఈ సందర్భంగా అఖిలేశ్ యాదవ్ కాషాయ పార్టీ గురించి ప్రస్తావిస్తూ.. ప్రపంచంలో తమదే అతిపెద్ద పార్టీ అని చెప్పుకునే బీజేపీ తమ అధ్యక్షుడిని ఎన్నుకోలేక పోతోందని విమర్శించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు బిగ్గరగా నవ్వారు.
వెంటనే అమిత్ షా దీనిపై స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అఖిలేశ్ యాదవ్ సహా ఇతర విపక్ష నాయకులకు చురకలు అంటించారు. సభలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్ని వారి అధ్యక్షుడిగా కుటుంబంలోని ఐదుగురి నుంచే ఎన్నుకుంటాయి. కానీ బీజేపీలో ఆ పరిస్థితి లేదు. 12 నుంచి 13 కోట్ల మంది కార్యకర్తలు పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అందుకు కొంత సమయం పడుతుంది. అని అమిత్ షా అఖిలేశ్ యాదవ్ కు కౌంటర్ ఇచ్చారు.