భారతదేశంలో పిడుగుపాటు వల్ల మరణాలు ఆందోళనకరంగా పెరిగాయని జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్.సి.ఆర్.బి) తెలిపింది. ముఖ్యంగా 2010-2020 మధ్య ఎక్కువగా పెరిగాయని వెల్లడించింది. 1967 నుంచి 2020 వరకు దేశంలో పిడుగుపాటు మరణాల సంఖ్య 1,01,309 ఉండగా.. 2010-20 మధ్య కాలంలో అత్యధిక మంది మరణించారని పేర్కొంది. 2003-2020 మధ్య ఒక్కో రాష్ట్రం, ఒక్కో కేంద్ర పాలిత ప్రాంతంలో ఏడాదికి సగటున 61 పిడుగుపాటు మరణాలు పెరిగాయని… ఏటా 1,876 మరణాల చొప్పున సంభవించాయని పరిశోధకులు తెలిపారు.
అత్యధిక పిడుగుపాటు మరణాలు మధ్యప్రదేశ్‌లో నమోదయ్యాయని ఈ నివేదిక పేర్కొంది. ఆ తర్వాత మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశాలలో ఎక్కువ మరణాలు సంభవించినట్లు తెలిపింది. ఈశాన్య భారతంలో 2001 నుంచి పిడుగుపాటు మరణాలు పెరుగుతున్నాయని వెల్లడించింది. అడవుల నరికివేత, జలాశయాల కనుమరుగు, భూతాపం వల్ల ఈశాన్యంలో పిడుగులు పడటం ఎక్కువైందని వివరించింది. పిడుగులు పడుతున్నా లెక్కచేయకుండా వ్యవసాయం వంటి కార్యకలాపాల్లో నిమగ్నమవ్వడంతో ఈ తరహా మరణాలు ఎక్కువవుతున్నాయని తెలిపింది. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేవలం ఏడు రాష్ట్రాలే పిడుగుపాట్లను ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయని చెప్పింది.