తెలంగాణ రాష్ట్రంలో రాగల రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అకాశం ఉందని తెలిపారు. ఇవాళ కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు, రేపు, ఎల్లుండి చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రాగల మూడ్రోజులు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం వుందని చెప్పారు.
ఈ సందర్భంగా కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపారు. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని.. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మరోవైపు ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం , దక్షిణ కోస్తాలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, రాయలసీమలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.