డాలర్ డ్రీమ్స్ బాట పడుతున్నారు ఇండియన్స్. విదేశీ విద్య కోసం, ఉద్యోగాల కోసం ఎక్కువగా అమెరికాకు వెళ్తున్నారు. మన దేశ విద్యార్థులకు విదేశాల్లో చదువుకోవాలంటే ముందుగా గుర్తుకు వచ్చే దేశం అమెరికానే. విద్యతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు ఉండటం కూడా ఈ దేశం వెళ్లడానికి విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. ఇతర దేశాల వీసాలతో పోలిస్తే… అమెరికా వీసా నిబంధనలు కాస్త సులువుగా ఉండటం కూడా భారతీయులకు కలిసి వస్తోంది.
దీంతో అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఆదేశ విద్యాసంస్థల్లో 2021లో చేరిన భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు 12 శాతం పెరిగింది. ఇదే సమయంలో చైనా నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య 8 శాతం తగ్గింది. అమెరికాలో చదువుకోవడానికి ప్రపంచంలో అత్యధిక మంది వెళ్తున్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా… భారత్ రెండో స్థానంలో ఉంది. చైనా నుంచి 3,48,992 మంది విద్యార్థులు వెళ్తుంటే…. భారత్ నుంచి 2,32,851 మంది చదువుకునేందుకు అమెరికా వెళ్తున్నారు.