పౌరసత్వ సవరణ (సీఏఏ) చట్టాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సీఏఏను ముస్లిం వ్యతిరేక చట్టంగా అభివర్ణించడాన్ని ఆయన తప్పుబట్టారు. కొందరిని వేరుగా ఉంచడం ఈ చట్టం ఉద్దేశం కాదని ఏఎన్ఐ పాడ్కాస్ట్లో చెప్పారు.
‘1947లో మతం ఆధారంగానే దేశ విభజన జరిగింది. వలస వెళ్లినవారు ఎప్పుడైనా తిరిగి రావచ్చని ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు చెప్పారు. అయితే బుజ్జగింపు రాజకీయాల కారణంగానే నాడు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోవడంలేదు. సీఏఏ విషయంలో మైనార్టీలు భయపడాల్సిన పనిలేదు. ఎవరి పౌరసత్వం రద్దు చేసే నిబంధన సీఏఏలో లేదు. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి వచ్చే హిందూ, బౌద్ద, జైన, సిక్కు, క్రిస్టియన్, పార్సీ శరణార్థులకు పౌరసత్వం, హక్కులను మాత్రమే సీఏఏ కల్పిస్తుంది. విపక్షాలన్నీ సీఏఏ విషయంలో అబద్దాలు ప్రచారం చేస్తున్నాయి’ అని అమిత్ షా మండిపడ్డారు. ఎన్నికల ముందే సీఏఏను ఎందుకు అమలు చేస్తున్నారన్న విమర్శలపై స్పందిస్తూ ఆ విమర్శలను అమిత్ షా కొట్టి పారేశారు.