“ఇకపై భాష పేరుతో విభజన జరగకూడదు. కొన్ని రాజకీయ పార్టీలు అవినీతి దాచి పెట్టేందుకు, రాజకీయంగా లబ్ధి పొందేందుకు భాష అంశాన్ని వివాదం చేస్తున్నాయి. ఇప్పటికే భాష పేరుతో దేశంలో చాలా విభజన జరిగింది. ఇకపై ఏమాత్రం అలా జరగకూడదు. హిందీ ఏ భాషకు కాంపిటీషన్ కాదు. అన్ని భాషలకూ హిందీ సోదర భాష.” అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాజ్యసభలో వివిధ అంశాలపై సుదీర్ఘంగా ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. భాషలన్నీ భారతదేశానికి నిధిలాంటివి అని అన్నారు. భాష పేరిట విభజన తీసుకువచ్చేందుకు చేసే పనులేం ఫలించవని పేర్కొన్నారు. మోదీ సర్కార్ రాజ్యభాషా విభాగాన్ని ఏర్పాటు చేసిందన్న కేంద్ర మంత్రి.. తెలుగు, తమిళం, అస్సామీ, హిందీ, పంజాబీ వంటి అన్ని భాషలకు ప్రాచుర్యం కల్పించడమే దీని లక్ష్యమని తెలిపారు. తమిళనాడులో తాము అధికారంలోకి వస్తే మెడికల్, ఇంజినీరింగ్ విద్యను తమిళ భాషలోనే అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.