భానుడి భగభగలతో మండిపోతున్న తెలంగాణ రాష్ట్రం ఇవాళ సాయంత్రం కాస్త చల్లబడింది. ఇవాళ సాయంత్రం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. మరికొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వానలు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. అయితే శనివారం, ఆదివారం కూడా పలుచోట్ల ఉరుములు మెరుపులు, వడగళ్లతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం రోజున కొన్ని జిల్లాల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఆదివారం రోజున ఈదురు గాలులు మాత్రం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వివరించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు రాగల మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సామాన్యంగా ఉండడంతో పాటు క్రమంగా పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.