ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా.. ఎంత అవగాహన కల్పిస్తున్నా.. దేశంలో ఇంకా బాల్యవివాహాలు ఆగడం లేదు. చాలా ప్రాంతాల్లో చిన్నవయసులోనే ఆడపిల్లల కలలకు పసుపుతాడుతో ఉరితాడు బిగిస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. బాల్య వివాహాలను అరికట్టడానికి తాజాగా అసోం ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. మైనర్లను వివాహం చేసుకున్న వ్యక్తులపై ఉక్కుపాదం మోపింది.
శుక్రవారం రోజున ఆ రాష్ట్రంలో భారీ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు మైనర్లను పెళ్లి చేసుకున్న 2,044 మందితో సహా వారి వివాహం నిర్వహించిన 51మంది పూజారులను అరెస్టు చేశారు. మరికొన్ని రోజులు ఈ ఆపరేషన్ సాగుతుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. ఇప్పటివరకూ బాల్య వివాహాలకు సంబంధించి 8 వేల మంది నిందితుల జాబితా తమ దగ్గర ఉందని.. 4 వేల మందిపై కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు.
14 ఏళ్ల లోపు వయసున్న బాలికలను వివాహం చేసుకున్న వారికి పోక్సో చట్టం కింద యావజ్జీవ కారాగార శిక్ష విధించనున్నట్లు హిమంత గతంలో ప్రకటించారు. భారీ ఎత్తున మహిళలు నిరసనకు దిగారు. తమ భర్తలను, కుమారులను అరెస్టు చేస్తే ఎలా జీవించాలని.. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.