ఉత్తరప్రదేశ్‌లో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు జరుగనున్నాయి.ఈ మేరకు ఉభయసభల షెడ్యూల్‌ను సెక్రటేరియట్ విడుదల చేసింది. ఆగష్టు 7న ప్రారంభమయ్యే అసెంబ్లీ సెషన్స్‌లో తొలిరోజు అధికారిక వ్యవహారాలు, కొత్తగా తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌లకు సంబంధించి బిల్లుల ఆమోదం,నోటిఫికేషన్‌లు వంటి అంశాలపై చర్చ జరుగనుంది. ఆగస్టు 8, 9, 10 మరియు 11 తేదీలలో ప్రశ్నోత్తరాలకు అవకాశమిస్తారు.
గత శాసనసభ సమావేశాల నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం 13 ఆర్డినెన్సులను జారీ చేసింది.వీటిలో ఉత్తరప్రదేశ్ శిక్షా చట్టం (కమ్యుటేషన్ ఆఫ్ అఫెన్సెస్ మరియు అబెట్మెంట్ ఆఫ్ ట్రయల్స్), ఉత్తరప్రదేశ్ మునిసిపల్ స్థానిక స్వపరిపాలన చట్టం, ఉత్తరప్రదేశ్ మునిసిపాలిటీ సవరణ ఆర్డినెన్స్, ఉత్తరప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ (సవరణ) ఆర్డినెన్స్ ఉన్నాయి.ఉత్తర ప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు (సవరణ) ఆర్డినెన్స్, ఉత్తర ప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు (రెండవ సవరణ) ఆర్డినెన్స్, ఉత్తర ప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు (మూడవ సవరణ) ఆర్డినెన్స్, ఉత్తర ప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు (నాల్గవ సవరణ) ఆర్డినెన్స్, ఉత్తర ప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీ (ఐదవ సవరణ) ఆర్డినెన్స్, ఉత్తరప్రదేశ్ నేషనల్ లా యూనివర్సిటీ, ప్రయాగ్‌రాజ్ (సవరణ) ఆర్డినెన్స్, ఉత్తరప్రదేశ్ టౌన్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ (సవరణ) ఆర్డినెన్స్, ఉత్తరప్రదేశ్ జగద్గురు రాంభద్రాచార్య దివ్యాంగ్ స్టేట్ యూనివర్శిటీ ఆర్డినెన్స్ మరియు ఉత్తరప్రదేశ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (సవరణ) ఆర్డినెన్స్ ఉన్నాయి.ఈ ఆర్డినెన్స్‌ల స్థానంలో ప్రభుత్వం బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది. వీటితో పాటు మరికొన్నికొత్త బిల్లులను కూడా సభలో ఆమోదించనున్నారు.
ఇదిలా ఉండగా సమావేశాలను కేవలం 5 రోజులే నిర్వహించడంపై అధికార పార్టీని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తరప్రదేశ్‌లో అనేక ప్రాంతాలు మునిగాయి. వరదనీరు చుట్టుముట్టి జనజీవనం తీవ్రంగా నష్టపోయింది.దీనిపై సభలో సమగ్రంగా చర్చ జరపాలని పట్టుబట్టేందుకు ప్రతిపక్షాలు అస్ర్తశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అలాగే యూపీలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భారీగా అవినీతి చోటుచేసుకుందని ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు.అంతేకాదు బీజేపీ వైఫల్యాలను ప్రస్తావించి వచ్చే ఎన్నికల్లో బలం కూడగట్టుకోవాలని అనుకుంటున్న విపక్షాల నేతలు అధికార బీజేపీని సభలో ఇరుకున పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా యోగీ సర్కారు అవలంబిస్తున్న దూకుడును అడ్డుకునేందుకు పలు రకాల ప్రశ్నలు సంధించనున్నారు. రాష్ర్టంలో ఉద్యోగ నియామకాల పేరుతో అమాయకులను మోసం చేశారని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు దీనిపై సభలో ప్రశ్నించనున్నారు.