లాక్ డౌన్ వలన చిన్న చిన్న కుటుంబాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రోజు రోజుకి కేసులు పెరగడం లాక్ డౌన్ ఇప్పట్లో ఎత్తేసే అవకాశం లేకపోవడం తో మా పరిస్థితి ఏంటీ అనే ఆందోళన ఇప్పుడు రోజు వారీ కూలీలు, ఆటో డ్రైవర్ లు, రిక్షా వాలాలు, టాక్సీ డ్రైవర్ లకు మొదలయింది. నెల రోజుల నుంచి ఆర్ధిక కష్టాలు పడుతూ అప్పులు తీసుకొచ్చి కుటుంబాన్ని పోషించే పనిలో పడ్డారు.
ఇప్పుడు అప్పులకు వడ్డీలు కూడా పెరగడం కట్టాల్సిన అప్పులు, ఇంటి అద్దె ఉండటం అన్నీ కూడా ఆందోళన కలిగిస్తుంది. దీనితో ఆటో వాలా ఒకరు ఆటోలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఆటోలోని పైపుకు తాడు బిగించి ఆత్మహత్య చేసుకోవడం కన్నీరు పెట్టించింది. వివరాల్లోకి వెళితే బీఎమ్‌సీ కాలనీ వద్ద ఓ ఆటో ఆగిఉండటం స్థానికులు గమనించి దగ్గరకు వెళ్లి చూసారు.
అందులో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు అని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న మృతుడి భార్య, పోలీసులు అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి తరలించారు. అతని వయసు 47 ఏళ్ళు అని, అతను కొన్ని రోజులుగా ఒత్తిడిలో ఉన్నాడని అతని భార్య చెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.