ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అయోధ్య శ్రీరాముడి క్షేత్రానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆలయ భద్రతకు ముప్పు కలిగిస్తామంటూ బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గుడి పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి.. ఆలయ పరిసరాల్లో పహారా కాయిస్తున్నారు. అయితే దీనిపై ఆలయ అధికారులు, పోలీసులు అధికారిక ప్రకటన ఇవ్వలేదు. దీంతో ఎలాంటి బెదిరింపు మెయిల్ వచ్చిందో స్పష్టత లేదు.
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారిక మెయిల్ ఐడీకి ఆదివారం రాత్రి బెదిరింపు మెయిల్ వచ్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇది తమిళనాడు నుంచి వచ్చినట్లు సమాచారం. రాముడి ఆలయ భద్రతకు ప్రమాదం కలిగించనున్నట్లు మెయిల్ లో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ మెయిల్ అందుకున్న వెంటనే అప్రమత్తమైన అధికారులు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీలను సైతం క్షుణ్నంగా పరిశీలించారు. ఈ ఘటనపై అయోధ్య పోలీసులు విచారణ జరుపుతున్నారు. తమిళనాడు వచ్చిన ఈ మెయిల్ ఇంగ్లీష్ భాషలో ఉన్నట్లు అధికారులు తెలిపినట్లు తెలిసింది.