తెలంగాణలో జరిగిన గ్రూప్-1 పరీక్షపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గ్రూప్-1లో కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని.. ఈ పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పరీక్ష రాయని 10 మందికి ఫలితాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. పేపర్లను ప్రొఫెసర్లతో ఎందుకు కరెక్షన్ చేయించలేదని.. రెండు సెంటర్లలో 1,497 మంది పరీక్ష రాస్తే.. 74 మందికి ఉద్యోగాలు ఎలా వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
“తెలంగాణ గ్రూప్-1 పరీక్షల్లో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. ఒక వరుసలో హాల్ టికెట్ నెంబర్ ఉండే 654 మందికి ఒకటే మార్కులు వచ్చాయి. ఇంకో వరుసలో హాల్ టికెట్ నెంబర్ ఉండే 702 మంది అభ్యర్థులకు ఒకటే మార్కులు వచ్చాయి. ఇది ఎలా సాధ్యం ? బీజేపీ నాయకులకు తెలంగాణ యువత పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే గ్రూప్ 1 పరీక్షల స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఒక హాల్ టికెట్ నంబర్, మెయిన్స్ లో ఇంకో హాల్ టికెట్ నంబర్ ఎందుకు ఇచ్చారు. భారత దేశంలో ఎక్కడ పరీక్ష రాసిన ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు పరీక్షలకు ఒకే హాల్ టికెట్ నంబర్ ఉంటుంది.” అని కౌశిక్ రెడ్డి అన్నారు.