సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురై మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటుచేసుకుంది. ఇటీవల చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్ పైకప్పు ప్లాస్టిక్ షీట్‌కు ఓ చిన్నారి ప్రమాదకరంగా వేలాడుతూ ఉన్న వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై నెటిజన్లు ట్రోల్ చేయడంతో ఆ తల్లి సూసైడ్ చేసుకుంది.
అసలేం జరిగిందంటే.. ఏప్రిల్ 28న చెన్నైలో ఓ 8నెలల శిశువు అపార్ట్‌మెంట్‌లోని బాల్కనీ రేకులపై ప్రమాదకరంగా వేలాడగా స్థానికులు రక్షించిన ఘటన వైరల్ అయింది. అయితే పసిబిడ్డను చూసుకోవడం చేతకాదా అంటూ తల్లిపై నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఈ ఘటన తర్వాత డిప్రెషన్‌కు గురైన తల్లి రమ్య, కోయంబత్తూరులోని తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన రమ్య, ఆదివారం ఇంట్లోని కుటుంబ సభ్యులు లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. వారు తిరిగి వచ్చేసరికి ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.