రిజర్వేషన్లను 50 నుంచి 65%నికి పెంచాలని నిర్ణయించిన బిహార్ సర్కార్

-

బిహార్‌ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచాలని తాజాగా నీతీశ్ కుమార్ ప్రభుత్వం నిర్ణయించింది. 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కలుపుకొని మొత్తం కోటాను 75 శాతానికి పెంచాలని నిర్ణయిస్తూ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ అసెంబ్లీలో ప్రతిపాదన ప్రవేశపెట్టారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లును అమల్లోకి తీసుకువస్తామని నీతీశ్ కుమార్ తెలిపారు.

బిహార్‌లో ఇటీవల చేపట్టిన కులగణన నివేదికను తాజా అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. బిహార్‌లో మూడో వంతుకుపైగా కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నట్లు ఈ నివేదికలో తేలింది. 34.13 శాతం కుటుంబాలకు నెలవారీ ఆదాయం 6 వేలు, అంతకంటే తక్కువగా ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.

ఈ నివేదిక ప్రకారం.. బిహార్‌లో మొత్తం 2 కోట్ల 97లక్షల కుటుంబాలు ఉండగా.. 94 లక్షల కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి. ఓబీసీలు, ఈబీసీలు, 60 శాతానికి పైగా ఉండగా.. అగ్రవర్ణాలు 10 శాతానికి పైగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలలో 43 శాతం మంది.. బీసీల్లో ఈ శాతం 33 శాతం.. అగ్రవర్ణాల్లో 25శాతానికిపైగా పేదరికంలోనే ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. మరోవైపు 50 లక్షల మంది ఉపాధి, విద్య కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే బిహార్‌లో రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచాలని ఆ రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version