ఇప్పటి వరకూ ఏ సర్టిఫికెట్‌కు అప్లై చేసుకోవాలన్నా.. ఆధార్ కార్డు కచ్చితంగా కావాలి. ఆధార్ కార్డులేనిదే ఏ పని కాదు. ఉన్న ఈ ఆధార్‌ను మళ్లీ పాన్‌కు, రేషన్‌కు, బ్యాంకుకు ఇలా ప్రతీదానికి లింక్ చేయాలి. కానీ ఇక ఆధార్ కార్డ్ నుంచి పాస్‌పోర్ట్ వరకు అన్నింటికీ బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్‌గా పరిగణించబోతోంది కేంద్ర ప్రభుత్వం. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి.
స్కూల్‌లో అడ్మిషన్ల నుంచి ఆధార్ కార్డ్ వరకు అన్నింటికీ బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్‌గా పరిగణించబోతోంది కేంద్ర ప్రభుత్వం. విద్యా సంస్థల్లో అడ్మిషన్, డ్రైవింగ్ లైసెన్సుల జారీ, ఆధార్ కార్డ్ లేదా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయడం, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ లాంటి అనేక పనులు, సేవల కోసం జనన ధృవీకరణ పత్రాన్ని ఒకే పత్రంగా ఉపయోగించవచ్చు. జనన మరణాల నమోదు (సవరణ) చట్టం, 2023ను పార్లమెంట్ గత వర్షాకాల సమావేశాల్లో ఆమోదించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీనికి ఆగస్టు 11న ఆమోదం తెలిపారు.
“జనన మరణాల నమోదు (సవరణ) చట్టం, 2023 (20 ఆఫ్ 2023)లోని సెక్షన్ 1లోని సబ్-సెక్షన్ (2) ద్వారా అందించబడిన అధికారాలను ఉపయోగించి, కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబర్ 1 నుంచి దీన్ని అమలు చేస్తోంది” అని రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ నోటిఫికేషన్ జారీ చేశారు.
జనన, మరణాల నమోదు (సవరణ) చట్టం, 2023, అమలులోకి వచ్చిన తేదీ లేదా ఆ తర్వాత జన్మించిన వ్యక్తి పుట్టిన తేదీ, ప్రదేశాన్ని నిరూపించడానికి
ఈ జనన ధృవీకరణ పత్రాన్ని ఒకే పత్రంగా ఉపయోగించడానికి చట్టం అనుమతిస్తుంది. విద్యా సంస్థలో ప్రవేశాలు, డ్రైవింగ్ లైసెన్స్ జారీ, ఓటరు జాబితా తయారీ, వివాహ నమోదు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఏదైనా చట్టబద్ధమైన లేదా స్వయంప్రతిపత్త సంస్థలో ఉద్యోగ నియామకం కోసం కూడా బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్‌గా ఇవ్వొచ్చు.
కానీ ఇలా ఎందుకు..?
- జననాలు, మరణాల నమోదుకు సంబంధించి జాతీయ, రాష్ట్ర-స్థాయి డేటాబేస్‌ను రూపొందించడానికి ఇది సహాయపడుతుంది.
- ప్రజా సేవలు, సామాజిక ప్రయోజనాలు, డిజిటల్ రిజిస్ట్రేషన్ సమర్థవంతమైన, పారదర్శక పంపిణీని నిర్ధారిస్తుంది.
- ఇందుకోసం జనన మరణాల ధృవీకరణ పత్రాలను ఎలక్ట్రానిక్ రూపంలో ఇవ్వడం సులభతరం అవుతుంది.
- దేశంలో పుట్టిన తేదీ, స్థలాన్ని రుజువు చేయడానికి అనేక పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు.
- ఇక దత్తత తీసుకున్నప్పుడు, అనాథల విషయంలో, సర్రోగేట్ ద్వారా పుట్టిన పిల్లల నమోదు ప్రక్రియ సులభతరం కానుంది. అంతేకాదు అన్ని వైద్య సంస్థలు, రిజిస్ట్రార్‌కు మరణ ధృవీకరణ పత్రాన్ని అందించడం తప్పనిసరి చేస్తుంది.