ఒడిశాలో బిజూ జనతా దళ్ కీలక నేత వీకే పాండియన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేడీ ఓటమికి బాధ్యత వహిస్తూ క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ప్రయాణంలో ఎవరినైనా బాధపెట్టి ఉండే తనను క్షమించాలని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. తనపై వ్యతిరేకంగా జరిగిన ప్రచారమే పార్టీ ఓటమికి కారణమైతే క్షమించాలని బీజేడీ కార్యకర్తల్ని పాండియన్ వేడుకున్నారు.
మరోవైపు, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ శనివారమే తన వారసుడి విషయంపై స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. తన వారసుడు ఎవరని అడిగిన ప్రతిసారీ పాండియన్ కాదని చెప్పానని.. అదే విషయం మళ్లీ చెప్తున్నానని తెలిపారు. ప్రజలే తన వారసుడిని నిర్ణయిస్తారని వెల్లడించారు. అయితే నవీన్ స్పష్టత ఇచ్చిన కొన్నిగంటలకే పాండియన్ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీజేడీని ఓడించి బీజేపీ విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే.