బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. అభ్యర్థులు భారీ ఎత్తున నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారం పై దాఖలు చేసిన పిటిషన్ విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై పాట్నా హై కోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ కు సూచించింది.
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల నిర్వహించినటువంటి ప్రిలిమినరీ పరీక్షలలో అవకతవకలు జరిగాయనే వ్యవహారం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వేలాది మంది అభ్యర్థులు పాట్నాలోని గాంధీ మైదాన్ వద్ద నిరసనకు దిగారు. ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు జల ఫిరంగులు ప్రయోగించి.. లాఠీ ఛార్జీ చేశారు. జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ విద్యార్థులకు పూర్తి మద్దతును ప్రకటిస్తూ జనవరి 02న ఆమరణ నిరహార దీక్ష చేపట్టారు. పాట్నాలోని గాంధీ మైదాన్ లో గత నాలుగు రోజులుగా ప్రశాంత్ కిశోర్ చేస్తున్న నిరవధిక నిరహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.