ఏ పార్టీతోనూ పొత్తులుండ‌వ్ !

-

– యూపీలో రానున్న అసెంబ్లీ ఎన్నిక‌లపై మాయావ‌తి వ్యాఖ్య‌లు
– ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టినుంచే ప్ర‌ణాళిక‌లు సిద్ధంచేస్తున్న ప్ర‌‌ధాన పార్టీలు

ల‌క్నోః బీజేపీ పాలిత ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు వెడెక్కుతున్నాయి. జ‌ర‌గ‌బోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా చాాలా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ.. అధికార పీఠం ద‌క్కించుకోవ‌డానికి అన్ని ప్ర‌ధాన పార్టీలు ఇప్ప‌టి నుంచి ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేస్తున్నాయి. దీని కోసం ప్ర‌త్యేక ప్ర‌ణా‌ళిక‌ల‌ను సిద్ధం  చేసుకుంటున్నాయి. దీనిలో భాగంగా ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా బ‌రిలోకి దిగాలా.. లేక పొత్తుల పెట్టుకోవాలా అనే విష‌యంపై అన్ని పార్టీలు ప్ర‌ధానంగా దృష్టి సారించాయి.

యూపీ మాజీ సీఎం, బీఎస్పీ చీఫ్ మాయావతి

ఇప్ప‌టికే రాష్ట్ర అధికార పార్టీ బీజేపీ పై ప్ర‌తిప‌క్షాల‌న్ని తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించ‌డంతో పాటు ప్ర‌భుత్వ త‌ప్పుడు నిర్ణ‌యాల‌ను ఎత్తిచూపుతూ.. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే బ‌హుజ‌న్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి మాయావతి శుక్ర‌వారం మీడియాతో మాట్లాడుతూ రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ఎన్నిక‌ల‌కు సంబంధించి త‌మ పార్టీ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ద‌ని తెలిపారు. యూపీలో తాము ఏ పార్టీతో ఎన్నిక‌ల్లో పొత్తుపెట్టుకోబోమ‌ని చెప్పారు. ఒంట‌రిగానే బ‌రిలోకి దిగుతామ‌ని స్ప‌ష్టం చేశారు. ఉత్త‌రాఖండ్ తో పాటు ఇత‌ర రాష్ట్ర ఎన్నిక‌ల్లోనూ ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని తెలిపారు.

నేడు మాయావ‌తి త‌న 65వ పుట్టిన రోజును జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగానే ఆమె స్పందిస్తూ పై విష‌యాల‌ను వెల్లడించారు. అలాగే, త‌మ పార్టీ పేద‌ల‌, బ‌ల‌హీన వ‌ర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తుంద‌ని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి రావ‌డానికి కార్య‌క‌ర్త‌లు క‌లిసిక‌ట్టుగా కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. క‌రోనా టీకాను ప్ర‌జ‌లంద‌రికీ ఉచితంగానే అందించాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. వివాదాస్ప‌ద నూత‌న మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకోవాల‌నీ, రైతు డిమాండ్ల‌కు అనుగుణంగా కేంద్రం నిర్ణ‌యం తీసుకోవాల‌ని మాయావ‌తి డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version