ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్యకేసు విషయంపై కెనడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్ డేవిడ్ విగ్నాల్ట్ గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో రెండుసార్లు భారత్‌లో రహస్య పర్యటనలు జరిపినట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి. ఈ కేసుకు సంబంధించిన విషయాలను భారతీయ అధికారులకు తెలియజేసేందుకే ఆయన పర్యటించినట్లు వెల్లడించాయి. ఈ హత్య విషయమై ఒట్టావా దర్యాప్తులో వెల్లడైన సమాచారాన్ని కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సీఎస్‌ఐఎస్) చీఫ్ విగ్నాల్ట్ భారతీయ అధికారులతో పంచుకొన్నట్లు సమాచారం.
నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉండే అవకాశముందంటూ గతేడాది సెప్టెంబరులో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల నడుమ సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే ట్రూడో ఆరోపణలు అసంబద్ధమైనవని భారత్ ఖండించింది. ఇంకోవైపు నిజ్జర్ హత్యకేసుతో సంబంధం ఉందంటూ ముగ్గురు భారతీయ యువకులను కెనడా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్టులకు కొన్ని వారాల ముందు విగ్నాల్ట్ భారత్‌లో పర్యటించారు.