అనారోగ్యం తీవ్రంగా ఉన్నవారు కానీ వారి బంధువులు కానీ చికిత్సకు నిరాకరిస్తే ఆ రోగులను ఆసుపత్రుల యాజమాన్యాలు ఐసీయూల్లో చేర్చుకోకూడదని కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. 24 మంది నిపుణులు కీలక మార్గదర్శకాలు రూపొందించారు. ఇందులో తీవ్ర వ్యాధి లేదా అనారోగ్యంతో మరణం అంచులకు చేరిన వారికి మరే ఇతర చికిత్స లేనప్పుడు, ప్రస్తుత చికిత్సతో వారి ఆరోగ్యం ఏ మాత్రం మెరుగుపడే అవకాశం లేనప్పుడు వారిని ఐసీయూల్లో ఉంచడం వృథా అని నిపుణులు పేర్కొన్నారు.
నిపుణుల మార్గదర్శకాల్లో కీలక అంశాలు ఇవే..
మహమ్మారులు, విపత్తుల సమయంలో పరిమిత వనరులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని, ఐసీయూల్లో రోగులను ఉంచే అంశంపై నిర్ణయం తీసుకోవాలి.
ఐసీయూ చికిత్సలు వద్దనుకునేవారు, ఆ మేరకు లివింగ్ విల్ రాసిన వారిని ఆ విభాగంలో చేర్చుకోకూడదు.
గుండె సమస్య లేదా శ్వాసకోశ వ్యవస్థ పనితీరులో హెచ్చుతగ్గులు, పెద్దస్థాయి శస్త్రచికిత్స చేయించుకొని ఉండటం వంటివి కూడా ఐసీయూల్లో చేర్చుకోవడానికి కారణాలుగా పరిగణించాలి.
రక్తప్రసరణ వ్యవస్థలో అస్థిరత, శ్వాస వ్యవస్థకు తోడ్పాటు అవసరమైన వారు, పర్యవేక్షణ అవసరమైన రోగులు, అవయవ వైఫల్యం, ఆరోగ్య పరిస్థితి క్షీణించే అవకాశమున్న వ్యాధులతో బాధపడేవారిని ఐసీయూల్లో చేర్చుకోవాలి.