కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 70 లక్షల మంది మొబైల్ నంబర్లను తొలగించింది. అయితే డిజిటల్ మోసాలను అరికట్టేందుకు అనుమానిత ఆర్థిక లావాదేవీలను జరుపుతున్న నంబర్లు మాత్రమే తొలగించినట్లు ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. సైబర్ క్రైమ్స్ పెరుగుతున్న దృష్ట్యా డిజిటల్ చెల్లింపుల మోసాలకు చెక్ పెట్టే అంశంపై కేంద్రం దృష్టి సారించినట్లు చెప్పారు.
డిజిటల్ మోసాల నివారణకు బ్యాంకింగ్ వ్యవస్థ కూడా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని వివేక్ జోషి అభిప్రాయపడ్డారు. ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థలో మోసాల కట్టడిపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉండేలా చూడాలని సూచించారు. సైబర్ మోసాలపై సమాజంలో అవగాహన పెరగాల్సి ఉందని వివేక్ జోషి పేర్కొన్నారు.
మరోవైపు.. ఇటీవల ప్రభుత్వ రంగానికి చెందిన యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)ల్లో డిజిటల్ మోసాలు జరిగిన విషయం తెలిసిందే. ఐఎంపీఎస్ ద్వారా ఖాతాదారుల ఖాతాల్లోకి యూకో బ్యాంక్ నుంచి పొరబాటున రూ.820 కోట్లు బదిలీ కాగా వెంటనే గుర్తించిన బ్యాంక్ ఖాతాలు బ్లాక్ చేసి రూ.649 కోట్లు రాబట్టింది. అయితే ఇది ఎలా జరిగిందనే విషయంపై ఇప్పటికీ ఆ బ్యాంక్ వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్రం అనుమానిత ఆర్థిక లావాదేవీలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.