కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి వివాహాది శుభకార్యాల్లో ప్లే చేసే సినిమా పాటలు కాపీరైట్ ఉల్లంఘన కిందకు రావని స్పష్టం చేసింది. అలాంటి వాటికి ఏ ఒక్కరు కూడా రాయల్టీ వసూలు చేయకూడదని తేల్చి చెప్పింది. శుభకార్యాల్లో పాటల కాపీరైట్స్‌కు సంబంధించి డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఇటీవల స్పష్టత ఇచ్చింది.
వివాహాది శుభకార్యాల్లో సినిమా పాటల వినియోగం కాపీరైట్ యాక్ట్ 1957లోని సెక్షన్ 52(1)కు విరుద్ధమని.. మతపరమైన కార్యక్రమాలు, అధికారిక వేడుకల్లో ప్రదర్శించే నాటక, సాహిత్య లేదా మ్యూజిక్/ఏదైనా సౌండ్ రికార్డింగ్‌లు కాపీరైట్ ఉల్లంఘన కిందకు రావని సెక్షన్ 52 (1) (za) చెబుతోందని డీపీఐఐటీ ఓ ప్రకటనలో తెలిపింది. వివాహ ఊరేగింపుతోపాటు పెళ్లికి సంబంధించిన ఇతర కార్యక్రమాలు కూడా మతపరమైన వేడుకల కిందకే వస్తాయని తెలిపింది. వీటిని దృష్టిలో ఉంచుకొని కాపీరైట్ సంస్థలు వీటికి దూరంగా ఉండాలని డీపీఐఐటీ స్పష్టం చేసింది.