ఫైవ్ స్టార్ రెస్టారెంట్లలో.. పెద్ద పెద్ద హోటళ్లలో ఎంత టేస్టీ ఫుడ్ తిన్నా.. స్ట్రీట్ ఫుడ్ తింటే వచ్చే మజాయే వేరు. కానీ చాలా చోట్ల స్ట్రీట్ ఫుడ్ ను అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తుంటారు. కొందరైతే కనీస నాణ్యత కూడా పాటించరు. ఈ క్రమంలోనే స్ట్రీట్ ఫుడ్ పై కేంద్ర సర్కార్ ఓ యోచన చేసింది.
బజ్జీలు, పునుగులు, పకోడీ తదితర చిరుతిళ్లతో పాటు అల్పాహారాలు, ఇతర ఆహార పదార్థాలు అందించే వీధి వ్యాపారులూ నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. నాణ్యత నిబంధనల నియంత్రణల పరిధిలోకి ఆ వ్యాపారులను తీసుకురావడంపై మార్గాన్వేషణ చేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఇది కష్టతరమైన వ్యవహారమే అయినా అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇదే అంశంలో ఇతర దేశాల్లో ఎలాంటి నిబంధనలు ఉన్నాయో సమాచారాన్ని సేకరిస్తామని తెలిపారు.