దేశ వ్యాప్తంగా టమాట ధరలు మండిపోతున్నాయి. ఈ క్రమంలోనే పలుచోట్ల టమాట చోరీలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చేన్లలోనుంచి టమాటాలు దొంగిలిస్తున్నారు. కర్ణాటకలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకు చెందిన రైతు సోదరులు ఓ ఐడియా ఆలోచించారు. టమాట చేనుకు సీసీటీవి కెమెరా ఏర్పాటు చేసి పంటపై నిఘా పెట్టారు.
హున్సుర్ మండలంలోని కుప్పే గ్రామానికి చెందిన రైతు సోదరులకు నగేశ్, కృష్ణకు 10 ఎకరాలు పొలం ఉంది. అందులో మూడున్నర ఎకరాల్లో టమాటా సాగు చేశారు. టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో.. వీరి పొలంలో దొంగలు పడుతున్నారు. తాజాగా టమాట చోరీ చేసిన వారిని చాకచక్యంగా పట్టుకున్న రైతులు.. బిలికెరే పోలీసులకు అప్పగించారు. దీంతో ఇలాంటి ఘటన మళ్లీ జరగకుండా ఉండేందుకు రైతులు పంటకు.. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అనంతరం రెండు సీసీటీవీ కెమెరాలను అమర్చి.. తమ మొబైల్ ఫోన్లకు అనుసంధానం చేసుకున్నారు. దీని ద్వారా పొలంలో ప్రతి కదలికను గమనిస్తున్నారు.