ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం అనూహ్య రీతిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 233 మంది దుర్మరణం పాలయ్యారు. 900 మందికిపైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒడిశా రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. అత్యంత దురదృష్టకర సంఘటన అంటూ విచారం వ్యక్తం చేశారు. ఆ ఘోర ప్రమాదంలో పలువురు మృత్యువాత పడడం, పలువురు తీవ్రగాయాల పాలు కావడంపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు రీతిలో ఆదుకోవాలని కోరారు. బాధితులకు, మృతుల కుటుంబాలకు భరోసాను కల్పించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.