లోక్‌సభ ఎన్నికల రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. విమర్శలు ప్రతివిమర్శలతో రాజకీయం హీటెక్కుతోంది. ఈ క్రమంలో పలువురు నేతలు సభల్లో చేసిన వ్యాఖ్యలపై ఇతరులు ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రధాని మోదీ చేసిన ఘాటు వ్యాఖ్యలపై ఆ పార్టీ మండిపడింది.
సల్మాన్ ఖుర్షీద్, ముకుల్ వాస్నిక్, పవన్ ఖేరా, గుర్దీప్ సప్పల్‌లతో కూడిన కాంగ్రెస్ బృందం ఎన్నికల కమిషన్‌ను కలిసిందని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. ఈసీకి మొత్తం ఆరు ఫిర్యాదులు ఇవ్వగా.. అందులో రెండు ప్రధానిపై ఉన్నాయని తెలిపారు. ఈసీ తన స్వతంత్రతను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని జైరాం రమేశ్ పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు. అది ముస్లిం లీగ్ మేనిఫెస్టో మాదిరిగానే కనిపిస్తోందని అన్నారు.