అవకాశం దొరికినప్పుడల్లా ప్రధాని మోదీపై విరుచుకుపడే కాంగ్రెస్ పార్టీ మరోసారి మోదీపై విమర్శలు ఎక్కుపెట్టింది. జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపుర్లో ఇప్పటి వరకు మోదీ పర్యటించకపోవడంపై హస్తం పార్టీ మరోసారి విమర్శలు చేసింది. ప్రపంచ కప్ మ్యాచ్ చూసేందుకు సమయం ఉన్న ప్రధాన మంత్రికి.. హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో పర్యటించేందుకు ఇప్పటికీ సమయం దొరకకపోవడ ఆశ్చర్యంగా ఉందంటూ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
“ఇవాళ్టి నుంచి రాజస్థాన్, తెలంగాణల్లో కాంగ్రెస్‌పై విమర్శలు చేసేందుకు మోదీ తిరిగి వస్తారు. నేటికీ ఉద్రిక్తతలు చల్లారని, ఎంతో మంది బాధితులు ఉన్న మణిపూర్‌లో పర్యటించేందుకు మోదీకి ఇంకా సమయం కుదరడంలేదు. ఆయన ప్రాధాన్యాలు స్పష్టంగా ఉన్నాయి. మే నుంచి హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో పరిస్థితిని పట్టించుకునే తీరక మోదీకి లేదు.” అంటూ జైరామ్ రమేశ్ ట్వీట్లో పేర్కొన్నారు. మణిపుర్ పరిస్థితులపై ప్రధాని మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ తరచూ విమర్శలు చేస్తూనే ఉండటం గమనార్హం.